Wednesday, March 25, 2015

వేమన శతకము

వేమన శతకము 
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడా విత్తనం చిన్నదే కదా!
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించటం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివపూజ వ్యర్థాలే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కడివెడు గాడిద పాలకంటే గరిటెడు ఆవుపాలు మేలును కలిగిస్తాయి. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికీ తృప్తిని కలిగిస్తుంది.
నిక్కమైన మంచినీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్య మరయ చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తట్టెడు గులకరాళ్ళ కంటే, ఒక మంచి నీలం శ్రేష్ఠం. అదే విధంగా వ్యర్ధమైన పద్యాల కంటే, ఒక చక్కని చాటు పద్యం శ్రేష్ఠమవుతుంది.
మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడ లోనచురుకు మనును
సజ్జను లగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మిరియపుగింజ మీద నల్లగానుప్పటికీ దానిని కొరికితే వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధంగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనిస్తే అసలు విషయం బయటపడుతుంది.
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు, పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనపడక గొప్ప గుణాలు కలవారై ఉంటారు.
మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
అత్తిపండు పైకందంగా కనపడుతుంది. దానిలోపల పురుగులుంటాయి. అదే విధంగా పిరికివాని ధైర్యం కూడా పైన పటారం లోన లొటారంగా ఉంటుంది.
నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తనకు ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజంగా తెలివైనవాడు. అన్నీ వచ్చని చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనంగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన బేధమే ఉన్నది.
నిండునదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఓ వేమా! నీటితో నిండిన నదులు గంభీరంగా నిల్చి ప్రవహిస్తాయి. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. చెడ్డగుణాలు గలవారు మాట్లాడినంత తొందరగా, మంచిగుణాలు గలవారు మాట్లాడరు.
అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ప్రపంచంలో ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందం కలిగించు వేమనా! అల్పుడు శాంతంతో మాట్లాడతాడు. కంచు ధ్వని చేసినట్లుగా బంగారం ధ్వని చేయదు కదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారంతోనూ సమానం.
కులము లోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కులంలో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతని వలన గౌరవాన్ని పొందుతుంది. వనంలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
పూజాపునస్కారాల కంటే బుద్ధి ప్రధానం. మాట కంటే మనసు ప్రధానం. కులం కంటే గుణం ప్రధానం.
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱచు వాని వంశమెల్లఁ
జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల
విశ్వదాభిరామ! వినుర వేమ! 
చెఱకు మొక్క చివర కంకి పుట్టి దాని తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశంలో దుష్టుడు పుట్టిన ఆ వంశం యొక్క గౌరవం నశిస్తుంది.
కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన
కులము చెడును వాని గుణము వలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
చెఱకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా, గుణహీనుడైన వ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోతుంది.
రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ! 
రాముని పుట్టుకతో రఘువంశం ఉద్ధరించబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశం నశించింది. ప్రపంచంలో పుణ్య పాపాలు ఈ విధంగానే ఉంటాయి.
హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైనా కష్టం కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితే వికారాన్ని కలిగిస్తుంది.
వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
వేరుపురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనం చేస్తాడు.
హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని
ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ! 
నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడు కాలేడు. సుగంధ ద్రవ్యాలు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.
విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
హంసలతో కలిసినంత మాత్రాన కొంగ మారనట్లుగా, పండితులతో కలిసినప్పటికీ మూర్ఖుడు మారడు.
అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ! 
దుష్టునకు అధికారం ఇస్తే, మంచి వారందరినీ వెడలకొట్టును. చెప్పు తినే కుక్క, చెరకు తీపి ఎరుగదు.
అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మూర్ఖునికి సంపద కలిగినట్లయితే పెద్ద వారినందరినీ తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.
ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఒక సంవత్సరంపాటు బోధిస్తే, ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు.
ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్రతో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.
పాము కన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
పాము వంటి పాపిష్టి జీవి కూడా ఏదైనా చెప్తే వింటుంది కానీ, మూర్ఖునికి ఎంత చెప్పినా అతని గుణం మారదు.
వేము పాలువోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపిజెందబోదు
ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను
విశ్వదాభిరామ! వినుర వేమ! 
వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికీ చేదు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కానీ మంచివాడు కాలేడు.
ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకు
పరగ మూలికకుఁ బనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకౌను
విశ్వదాభిరామ! వినుర వేమ! 
పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాలఁబోసి వండఁ జవికిరావు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోప్పులకు మంచి గుణము అలవడదు.
పాల నీడిగింట గ్రోలుచునుండెనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఈడిగవాని ఇంటిలో పాలు తాగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ కూడని స్థలంలో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.
కానివానితోడఁ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
వేగిరింప నదియు విషమెయగును
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన?
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కోపంతో ఏ పనీ చేయకూడదు. అలా చేస్తే ఆ పని జరగదు. వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. పచ్చికాయను తెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదు గదా!
కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలునీడేరు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కోపం వలన గొప్పతనం నశించటమే గాక దుఃఖం కలుగుతుంది. కోపాన్ని తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడా జయిస్తుంది. కానీ బయట కుక్కను కూడా ఏమీ చేయలేదు. అది స్థాన మహిమే కాని తన మహిమ కాదు.
నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరెడైన బారలేదు
స్ధానబల్మిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ! వినురవేమ! 
నీటిలో స్వేచ్ఛగా సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అది స్థాన మహిమ కానీ, తన మహిమ మాత్రం కాదు కదా!
నీళ్ళమీదనోడ తిన్నగఁబ్రాకు
బైట మూరుడై బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
నీటిమీద ఏ ఆటంకము లేకుండ తిరిగి ఓడ భూమి పై ఒక మూరెడు కూడ వెళ్ళలేదు. ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానము మారిన పనికి రాని వాడవుతాడు.
కులము లేని వాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తక్కువ కులం వాడైనప్పటికీ ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందుతాడు. ధనం లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడా రాణించడు. కాబట్టి కాలం కంటే ధనం ఎక్కువ.
కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాఁడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మంచి కులం గలవాడు, మంచి గోత్రం కలవాడు, చదువు కలిగిన వాడు బంగారం గలవానికి బానిసలవుతారు. లోకంలో ధనమే ప్రధానం.
కనియు గానలేఁడు కదలింపఁడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతంబిది
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చినా వచ్చినవానివలే ఎవరైనా తనని చూసినా చూడనట్లుగా, వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.
ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మనిషి పుట్టినపుడు తన కూడా తీసుకొని రాలేదు. చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేడు. తానెక్కడికి పోతాడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్థం.
తనువ దెవరి సొమ్ము తనదని పోషించి
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొనcగ
ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తన సొంతమని పోషించటానికి ఈ శరీరం ఎవరిదీ కాదు. దాచిపెట్టటానికి ధనం ఎవరిదీ కాదు. పారిపోకుండా నిలవటానికి ఈ ప్రాణం ఎవరిదీ కాదు. ఇవి ఏమీ శాశ్వతం కావు.
గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన
పాలనీక తన్ను పండ్లురాల
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసుకొనివెళ్తే పళ్ళు రాలేటట్టు తంతుంది కానీ, పాలు ఇవ్వదు. అదే విధంగా లోభిని యాచించటం కూడా వ్యర్థం.
మేక కుతికబట్టి మెడచన్ను గుడవంగ
ఆఁకలేల మాను ఆశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మేక మెడకిందనున్న చన్నులను కుడిచిన పాలు దొరకవు. ఇదే రీతిగా లోభిని యాచించిన ప్రయోజనముండదు.
పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఎదుటి వారికి సహాయం చేయనివాడు పుట్టినా, చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా, చచ్చినా ఒకటే కదా!
ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసుగు నీగల భంగి
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఆయువు ఉన్నంతకాలం మనుష్యులు ఆశ వదలలేక కాలం గడుపుతుంటారు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరిస్తుంటారు.
నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
గాల మందు చిక్కి గూలినట్లు
ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
నీళ్ళలోని చేప కొంచెం మాంసానికి ఆశపడి గాలానికి చిక్కినట్టు, మనిషి ఆశ పుట్టి చెడిపోతాడు.
ఆశ పాపజాతి యన్నింటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఆశ చాలా పాపమైనది. ఆశతో మునులు సహితం చెడిపోతారు. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమైన మనసు గలవారు.
అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
అన్ని దానాలకంటే అన్నదానం గొప్పది. కన్నతల్లి కంటే మించింది లేదు. గురువుకంటే గొప్పదిలేదు.
ఆశకోసి వేసి యనలంబు చలార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలసి
నిలిచి నట్టివాఁడె నెఱయోగి యెందైన
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఆశ వదిలి, ఆశలను అగ్ని చల్లార్చుకొని, కామం వదిలి గోచి బిగించి కట్టి, జ్ఞానం తెలుసుకొనేవాడే నేర్పరియైన యోగి.
కనకమృగము భువిని గద్దు లేదనకను
తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
భూమిపై బంగారులేళ్ళు వున్నాయో లేవో అని ఆలోచించకుండానే శ్రీరాముడు, భార్యను విడిచి ఆ లేడి వెంటపడెను. ఆ మాత్రం తెలుసుకోలేనివాడు దేవుడెట్లయ్యెను?
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ! 
గ్రద్ద, చనిపోయిన పశువు యొక్క చర్మాన్ని, కండలను ఊడబెరికి తింటుంది, ఈ రాజులూ ఆ గ్రద్ద వంటివారే కదా!
అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను
గలలఁ గాంచులక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కెరటంలో పుట్టిన బుడగలు అప్పుడే నిశిస్తాయి. కలలో కనబడిన లక్ష్మిని పొందలేము. ఈ భూమిలో భోగభాగ్యాలు కూడా ఇట్టివే కదా!
కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కొండముచ్చులు, కోతిని తెచ్చి క్రొత్తవస్త్రం కట్టి పూజించినట్లే, నిర్భాగ్యులు గుణం లేనివారిని కొలుస్తుంటారు.
కల్లలాడువాని గ్రామకర్త యరుగు
సత్యమాడువాని స్వామి యరుగు
బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
అబద్ధాలాడే వానిని గ్రామపెద్ద తెలుసుకొంటాడు. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొంటాడు. తిండిపోతుని భార్య ఎరుగుతుంది.
కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగు తనయుని జన్మంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
నీరు పల్లమెరుగును. సత్యం, అసత్యం భగవంతుడు తెలుసుకొంటాడు. కుమారుని పుట్టుక తల్లికే తెలుసు.
మైలకోకతోడ మాసినతలతోడ
ఒడలు మురికితోడ నుండెనేమి
అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మాసిన చీరతో, మాసినతలతో, మురికిగా ఉన్న శరీరంతో ఉంటే గొప్పకులంలో పుట్టినవారినైనా హీనంగా చూస్తారు.
ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఉప్పులేని కూర రుచిగా వుండదు. పప్పులేని భోజనం బలవర్ధకం కాదు. అప్పులేనివాడే ధనవంతుడు.
చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటియై ధరజెల్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఈ ప్రపంచంలో జనులు చెట్లపాలు మంచివి కావంటారు. గేదెపాలు వారికి హితంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో పదిమందీ చెప్పే మాటే చెల్లుతుంది.
పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టివిడుచుకన్న బరగ జచ్చుటమేలు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
పట్టుదల వహించరాదు. వహిస్తే ఆ పట్టు వదలరాదు. పట్టిన పట్టు మధ్యలో విడవటం కంటే మరణం మేలు.
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తనతప్పులెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఇతరుల తప్పులను పట్టుకొనేవారు, అనేకులు కలరు. కానీ తమ తప్పులను తాము తెలుసుకోలేరు.
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ! వినుర వేమ!
తమకుగల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులగాంచి
చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తనలో అనేక తప్పులు పెట్టుకొని, దుర్మార్గులు ఇతరుల తప్పుల్ని యెంచుతారు. చక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్లు వుంటుంది కదా!
ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరియంట నేర్చునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఇనుము విరిగితే కాల్చి అతుకవచ్చు. మనసు విరిగితే మరలా అంటించటం ఎవరితరం కాదు.
ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు
తమకుచే టెరుగని ధరణి నరులు
తమ్ము జెఱచువాడు దేవుడు లేడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఇతరులను పాడు చేయాలని కొందరు ఆలోచన చేస్తారు. కానీ, తమకు కలిగే ఆపదలను గ్రహించలేరు. ఒకరిని పాడు చేయాలని చూస్తే, భగవంతుడు వారినే పాడుచేస్తాడు.
కానివాని చేతగాసు వీసంబిచ్చి
వెంటదిరుగువాడె వెఱ్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
దుర్మార్గుని చేతికి ధనమిచ్చి, దానికోసం మరలా అతని వెంట తిరగడం తెలివితక్కువతనం. పిల్లి మ్రింగిన కోడి పిలిచినా పలుకదు కదా!
మాటలాడనేర్చి మనసు రాజిలజేసి
పరగఁ బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేత సొమ్ము లూరక వచ్చువా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఇతరులకు సంతోషం కలిగేట్లు మాట్లాడు విధానం నేర్చుకొని వారి మనస్సు ఆనందపరిచి, శ్రమపడకుంటే వారి నుండి చేతిలో సొమ్ము తేరగా రాదు.
చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కినా, అపకారం చేయక, తగిన ఉపకారాన్నే చేసి విడిచిపెట్టటం మంచిది.
వాన గురియకున్న వచ్చును క్షామంబు
వాన గురిసెనేని వరదపారు
వరద కరవు రెండు వలసతో నెరుగుడీ
విశ్వదాభిరామ! వినుర వేమ! 
వాన కురవకపోతే కరువు వస్తుంది, వాన కురిస్తే వరద వస్తుంది. వరదా, కరువూ రెండూ ఒకదాని వెంట మరొకటి వస్తాయని తెలుసుకోవాలి.
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పట్టునా జగంబు వట్టిదెపుడు
యముని లెక్క రీతి అరుగుచు నుందురు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
పుట్టిన వారందరూ మరణించకపోతే, యీ భూగోళం పట్టదు. యముని లెక్క ప్రకారం ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉంటారు.
వాన రాకడయును బ్రాణాంబు పోకడ
కానబడ దదెంత ఘనునికైన
కానపడిన మీద కలియెట్లు నడచురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఈ కలియుగంలో వానరాకడ, ప్రాణం పోకడ ముందుగా ఎవరూ తెలుసుకోలేరు. ఇది కలియుగ ధర్మం.
చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమౌతుంది. నీటిలో పడింది, నీటిలో కలిసిపోతుంది. ప్రాప్తించు చోట ఫలం తప్పదు.
ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంటదిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఎన్నిచోట్ల తిరిగి ఎన్ని కష్టాలు పడినా, లాభం కలుగనీయక శని వెంటాడి తిరుగుతుంది. తమ ప్రదేశం క్రొత్తదైనా, తినేవారు క్రొత్తవారు కాదు గదా.
కర్మ మధికమై గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
పూర్వజన్మలో చేసిన కర్మ అనుభవించక తప్పదు. ధర్మరాజు వంటివాడు, ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలం కంకుభట్టుగా వున్నాడు.
అనువుగాని చోట అధికుల మనరాదు
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ! 
వీలుగానిచోట అధికుడనని సంచరించరాదు. సామాన్యంగా ఉండటం నీచంగాదు. అద్దంలో కొంత చిన్నదిగా కనిపించినా, అసలు చిన్నది కాదు కదా!
ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్ని యుమాని
కాలమొక్కరీతి గడపవలయు
విజయ డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
చెడ్డకాలం వచ్చినపుడు భోగాలన్నీ వదులుకొని సామాన్యంగా కాలం గడపాలి. అర్జునుడు రాజ్యం పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరాడు గదా!
చిక్కియున్నవేళ సింహబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
కలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
బలం లేనప్పుడు సింహన్నైనా, బక్కకుక్క కరిచి బాధపెట్టును. శక్తిలేనప్పుడు పంతాలకు పోకుండా తలవంచుకొని తిరుగటం మంచిది.
లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి
పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ
జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
గొప్ప ధనవంతుడైన రావణుని లంకను, సామాన్యమైన కోతులు నాశనం చేసెను. చెడ్డకాలం వచ్చినప్పుడు సామాన్యులైనా అపకారం చేస్తారు.
మొదట ఆశపెట్టి తుది లేదుపొమ్మను
పరలోభులైన పాపులకును
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మొదట ఉపకారం చేస్తానని చెప్పి, త్రిప్పి త్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారం వుండేలు దెబ్బలాగా తప్పక తగులుతుంది.
ఇచ్చువానియొద్ద నీయని వాడున్న
ఇచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చ చెట్టున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
దాత దగ్గర లోభిచేరితే, చచ్చినా ధర్మం, పరోపకారం చేయనీయడు. సకల కోరికలనిచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళ పొదవుంటే కల్పవృక్షం దగ్గరకు పోనీయదుగదా.
అరయ నాస్తియనక యడ్డుమాటాడక
పట్టుపడక మదిని దన్ను కొనక
తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఆలోచించగా, లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో ఇవ్వనా? వద్దా! అని ఆలోచించక తనది కాదని ఇతరులకు పెట్టటమే మంచిదే.
ధనము కూడబెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ధనం సంపాదించి, దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చేట్లు, ఇతరుల పాలు చేయటం అవుతుంది.
కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు
కాశి కరుగఁ బంది గజము కాదు
వేరుజాతి వాడు విప్రుండు కాలేడు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కేరళ దేశం పోయినా కుక్క సింహం కాలేదు. కాశీకి పోయినా పంది యేనుగు కాలేదు. ఇతర కులం వారు బ్రహ్మణులు కాలేరు.
తవిటి కరయ వోయ దండులంబులగంప
శ్వాన మాక్రమించు సామ్యమగును
వైశ్వవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తవుడును చూడటానికి పోతే బియ్యం గంప కుక్క తినేసినట్లుగా, వైశ్యుని సొమ్ము నీచుల పాలవుతుంది.
దాత కాని వాని దరచుగా వేఁడిన
వాఁడు దాత యౌనె వసుధలోన
ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
దాతృత్వం లేనివానిని ఎన్ని సార్లు అడిగినా ఏమీ లాభంలేదు. సముద్రంలో ముంచినా అవురుగడ్డి దర్భగాదు.
పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
రాతి గుండు పగులగొట్టవచ్చు. కొండలన్నీ పిండిగొట్టవచ్చు. కఠిన హృదయుని మనసు మాత్రం మార్చలేం.
వంపుకర్రగాల్చి వంపు దీర్పగవచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగరాదు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
వంకరగా ఉన్న కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చు. కొండలన్నిటినీ పిండి గొట్టవచ్చు. కానీ కఠిన హృదయం మాత్రం మార్చలేం.
విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేద వానియింట బెండ్లయిననెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ధనవంతుని వీపుపై పుండు పుట్టినా, ఆ విషయాన్ని లోకంలో అందరూ చెప్పుకొంటారు. పేదవాని యింటిలో పెండ్లి అయినా చెప్పుకోరు.
ఆపదల వేళ బంధులరసిజూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ! వినుర వేమ! 
కష్టాలు కలిగినప్పుడు బంధువుల దగ్గరకు పోయి పరిశీలించు. భయం కలిగినప్పుడు సేవకుని ధైర్యాన్ని పరీక్షించు. దరిద్రంలో వున్నప్పుడు భార్య గుణం పరీక్షించు.
ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి
వేఱె పోవువాడు వెఱ్రివాడు
కుక్క తోకబట్టి గోదావ రీదునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
భార్యమాటలు విని అన్నదమ్ములను వదలిపోవటం అజ్ఞానం. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం అసాధ్యం అని తెలుసుకోవాలి.
మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినుర వేమ! 
భర్తకాలంలో కష్టపడి గృహాన్ని కాపాడుకుంటే, కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడవచ్చు. ఎంతవారికైనా కలిమి, లేమి రెండూ జీవితంలో వస్తాయి.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోనిపోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టంలేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి.
తనకు లేనినాడు దైవంబు దూరును
తనకు గల్గెనేమి దైవమేల?
తనకు దైవమునకు దగులాట మెట్టిదో
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మనిషి, తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి, దేవునికి సంబంధమై ఉంటుందేమో కదా!
మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మనసులో ఉన్నది ఒకటి, పైకి మాట్లాడేది మరొకటి. తన గుణం ఒకటి, ఆలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షం దొరకదు.
మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని
పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు
కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెతికినట్లుగా, గదిలోకి వచ్చిన దొంగ ధనం కొరకు వెతుకునుగానీ, దేవునికి మ్రొక్కడు.
అంతరంగమందు సపరాధములు చేసి
మంచివానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మనిషి చాటు మాటుగా అనేక తప్పులు చేసి, ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కానీ సర్వం తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులను గుర్తిస్తాడు.
వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షం రాదు. తలలు బోడి చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదు కదా!
ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
మూర్ఖుణ్ని మూర్ఖుడే మెచ్చుకొంటాడు. అజ్ఞానియైన వాడు లోభివానినే మెచ్చుకుంటాడు. పంది బురదనే కోరుకుంటుంది కానీ, పన్నీరును కోరుకోదు.
గాజుకుప్పెలోన గడఁగుచు దీపంబ
దెట్టు లుండు జ్ఞాన మట్టులుండు
దెలిసినట్టి వారి దేహంబులందును
విశ్వదాభిరామ! వినుర వేమ! 
గాజు బుడ్డిలో ఏ విధంగా దీపం నిలకడతో వెలుగుతుందో, అదే విధంగా తెలివిగల వారిలో జ్ఞానదీపం ప్రకాశిస్తుంది.
అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేమి యేన్నఁబోరు
అన్న మెన్న జీవనాధార మగునయా
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానంతో సాటిగావు. ఆలోచిస్తే అన్నమే యీ లోకంలో జీవనాధారం.
ఇహరంబులకును నిది సాధనంబని
వ్రాసి చదివిన విన్నవారికెల్ల
మంగళంబు లొనరు మహిలోన నిది నిజము
విశ్వదాభిరామ! వినుర వేమ! 
ఈ లోకంలో, పరలోకంలో కూడా సుఖపడటానికి మార్గంగా, ఉంటుందని ఈ శతకం వ్రాశాను. దీనిని చదివిన వారికీ, విన్నవారికీ శుభాలు కలుగుతాయి. ఇది నిజం.
చెప్పులో ఉన్నరాయి, చెవిలో దూరిన జోరీగ, కంటిలో పడిన నలుసు, కాలిముల్లు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తాయి.
 
తరచుగా పాడుతుంటే కంఠధ్వని మాధుర్యంగా ఉంటుంది. ప్రతిదినం తింటుంటే వేపవేరైనా తియ్యగా ఉంటుంది. ప్రయత్నం చేస్తూ ఉంటే పనులు నేరవేరుతాయి. ఈ ప్రపంచంలో పద్ధతులు యీ విధంగా ఉంటాయి.
పనికిరాని వానితో తిరిగితే వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికీ కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.

వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
అన్ని వ్యాయామల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ప్రతి ఒక్కరూ రోజూ అరగంట నుంచి గంటసేపు నడవాలి.నడిచేటప్పుడు తప్పనిసరిగా షూ వేసుకోవాలి. నడక మొదలు పెట్టే ముందు కనీసం పది, పన్నెండు నిముషాలు వామప్ (శరీరానికి చురుకు పుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం ) చేయాలి. ఆ తర్వాత వేగంగా నడవాలి. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచి వేగంతో నడిచినట్లు లెక్క. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరమూ, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం.

ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతున్నట్లు మూడు నిమిషాలు తర్వాత చదును ప్రాంతం మీద రెండు నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మొదట్లో తక్కువ దూరం వెళ్ళినా తర్వాత, తర్వాత వేగం, దూరం పెంచుకుంటూ వెళ్ళాలి.

వాకింగ్ చేసేటప్పుడు పండ్లు, కొబ్బరినీళ్ళు తప్పనిసరి
కొత్తగా వ్యాయామాన్ని మొదలుపెట్టారు. క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇక్కడ మీరొక కీలకమైన అంశాన్ని గుర్తించి తదనుగుణమైన చర్యలు చేపట్టడం అత్యవసరం. ఎందుకంటే వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో పోషకవిలువలు కొంతవరకు తగ్గుతాయి. ఆ లోపాన్ని అధిగమించేందుకు ఈ చర్యలు చేపట్టాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణం తగ్గుతుంది. అందుకే అరటిపళ్ళూ, బత్తాయిలు, కమలాలు, పుచ్చకాయలు, టమాటాలు సంవృద్ధిగా తీసుకోవాలి. కొబ్బరినీటిలో సోడియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లను పాలద్వారా పొందవచ్చు. వీటితో పాటు అధికంగా తృణధాన్యాలు, పళ్ళూ, గోధుమలు తప్పనిసరి.

మధ్యవయస్సులో ఎదుర్కొనే సమస్యలు

మధ్యవయస్సులో ఎదుర్కొనే సమస్యలు
మధ్యవయస్సులో ఎదుర్కొనే సమస్య మానసిక ఒత్తిడులు. మానసిక ఒత్తిడుల తీవ్రత స్త్రీలలో బాగా కనిపిస్తుంది. పెద్దరికంతో, ఆత్మవిశ్వాసంతో, తమలోని సృజనాత్మక శక్తితో ఏ సమస్యలనుంచి బయటపడవచ్చు? వయస్సు తీసుకొచ్చిన మార్పులను హుందాగా స్వీకరించే పరిణతిని, హుందాతనాన్ని పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా మీరు సాదించాలన్న విజయాలపై దృష్టి పెడితే మిడిల్ ఏజ్ సిండ్రోం నుంచి, దాని సమస్యల నుంచి బయటపడవచ్చు. పౌష్టిక ఆహారం, మానసిక, సామాజిక, శారీరక, ఎమోషన్ల సమస్యలు, ఫిట్ నెస్ ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని సూచనలు ఇక్కడ ఇస్తున్నాము.
  • నిత్యం వ్యాయామాలు చేయడం.
  • రోజూ పోషకాహారం తీసుకోవడం.
  • మీ వయసు మహిళలతో కలసి కమ్యూనిటీ వర్క్స్ లో పాలు పంచుకోవాలి, లేదా మీకునచ్చిన యాక్టివిటీలో ఎప్పుడూ బిజీగా ఉండాలి.
  • ప్రతిరోజూ ధ్యానంచేయాలి.
  • రోజు స్ట్రెచ్చింగ్ ను రెండు లేదా మూడు సార్లు చేయాలి. మైండ్ రిల్యాక్సేషన్ వ్యాయామాలు చేయాలి. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాలి.
వన్ లెగ్ హిప్ ఎక్స్ టెన్షన్
నేలమీద చాప పరిచి దానిమీద పడుకోవాలి. రెండు కాళ్ళనూ మడవాలి. మడిచిన ఒక కాలిని మెల్లగా పైకి (గాలిలోకి) లేపాలి. పిరుదులను పైకి, కిందకి మెల్లగా, దించుతూ కదిలించాలి. ఇలా 10-15 మార్లు రెండు సెట్లు చేయాలి.
స్టాండింగ్ వన్ లెగ్ హిప్ ఎక్స్ టెన్షన్
(మోకాలు మడిచి) ఎడమ కాలిమీద నిలబడి మోకాలిని మడవాలి. మజిల్స్ ను కదిలిస్తూ, కుడి కాలిని పైకి లేపాలి. మళ్ళీ కిందకి దించాలి. ఇలా 15 మార్లు మూడు సెట్లు చేయాలి.
మనలో చాలా మందికి పనులు వాయిదా వేయడం అలవాటే. తమకు తాము ప్రరణ కలిగించుకుని తీసుకున్న నిర్ణయాన్ని చివరంటా కొనసాగించగల శక్తి అందరికీ ఉండదు. వ్యాయామం చేయడంలోనూ మీది అదే తీరైతే గ్రూప్ వ్యాయామమే మీకు తగినది.
  • పరస్పరం మాట్లాడుకుంటూ ఉండటంవల్ల ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి వ్యాయామానికి సంబంధించిన ఒక్కో అంశం గురించి చర్చించుకుంటూ ఉండటం వల్ల తేలికగా అనుసరించగలుగుతారు.
  • రోజూ వ్యాయామం చేసేటప్పుడు పోటీపడి అందరితో సమానంగా చేయగలుగుతారు. త్వరగా నేర్చుకోనే అవకాశమూ ఉంది.మనకు తెలియకుండానే పక్కవారైకన్నా బాగా చేయాలన్న పట్టుదల వచ్చేస్తుంది.
  • ఒక్కరమే చేస్తుంటే మధ్యలో అప్పుడప్పుడు బద్దకించడం, ఇవ్వాళకిది చాల్లే అనుకోవడం సహజం. అదే సమూహంలో ఉంటే తప్పనిసరిగా అందరితోపాటు ముందుకు వెళ్ళాల్సివస్తుంది. కాబట్టి ఫీజు చెల్లించి మానుకోవడమనే ప్రశ్నే తలెత్తదు.
  • సాధారణంగా గ్రూప్ అనగానే ఏదైనా గుంపులో గోవిందయ్య చందమైపోతుంది. వ్యక్తిగతశ్రద్ద చూపరు. అన్న అభిప్రాయం ఉంటూంది. అది తప్పు. వ్యక్తిగా కన్నా బృందంగా ఉన్నప్పుడే శిక్షకులతో ఇంటరాక్షన్ ఎక్కువ. నిజానికి గ్రూపుగా ఉన్నవారికి చెప్పడం శిక్షకులకూ ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కొక్కరిని పేరుపేరునా గుర్తు పెట్టుకొని తప్పనిసరిగా అందరూ ఒకే వేగంతో చేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షిస్తారు.
  • ఎత్తు, బరువు, శరీర కొలతలు ఎప్పటికప్పుడు చూస్తూ వాటికి తగ్గట్లుగా ఆహారం తీసుకునేలా డైట్‌చార్ట్ చేసి ఇస్తుంటారు శిక్షకులు. వ్యక్తి కన్నా గ్రూపుగా సాధించిన విజయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
  • భోజనం చేసిన తరువాత కనీసం రెండు గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని వ్యాయామ నిపుణులు అంటున్నారు. ఈ రెండు గంటలు చేసే వ్యాయామం తిన్న ఆహారాన్ని సరైన కేమంగా అరుగుదలకు వచ్చేలా చేయడమే కాకుండా, తద్వారా వచ్చిన శక్తిని శరీర భాగాలన్నిటికి సమాంతరంగా చేరుతుంది. ఇలా చేయడంవల్ల ఎలాంటి కీళ్ళ నొప్పులూ ఉండవని పైగా ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే గ్యాస్ సమస్య కూడా ఉండదని వారు చెబుతున్నారు.
  • వ్యాయామానికి ముందు తీసుకొనే ఆహారం చాలా తక్కువ పరిమాణంలో ఉండాలి. దీనివల్ల వ్యాయామం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఈ పద్దతి ఉపకరిస్తుంది. ఎంతసేపు వ్యాయామం చేసినా అనవసరమైన అలసట లేకుండా ఇంకా చేయాలనే ఉత్సాహం పుడుతుంది.
  • ఒక్కోసారి వ్యాయామం చేయడానికి అవసరమైన శక్తి మీకు లేదనిపించినా, రాత్రి నిద్ర సరిపడినంత లేక నీరసంగా ఉన్నా ఆరోజు తప్పకుండా మీ వ్యాయామం సమయాన్ని తగ్గించుకోండి. కాస్త కష్టంగా ఎక్కువ శక్తిని ఉపయోగించనవలసిన వ్యాయామాలను కూడా ఆరోజుకి పక్కన పెట్టండి. లేదంటే మరింత నీరసం తోడవుతుంది.
  • మీరు మంచి, సంతృప్తికరమైన నిద్రను అనుభవించిన తరువాత ప్రశాంతంగా లేచి వ్యాయామాన్ని అశ్రద్ద చేయకండి. ఎందుకంటే మీకు అంత మంచి నిద్రను అందించైంది వ్యాయామమేనన్న విషయాన్ని విస్మరించకండి. మంచి నిద్రకు సంబంధించి ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. అయితే వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి కచ్చితంగా ప్రశాంతమైన మంచి నిద్ర అందుతుంది.
  • మీ వయసు 35 సంవత్సరాలు నిండినట్లయితే వ్యాయామానికి వెళ్ళే ముందు డాక్టరును సంప్రదించటం మరిచిపోకండి. మీ కుటుంబంలో ముందు తరం వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి, వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఫ్యామిలీ డాక్టరు ద్వారా తప్పనిసరిగా ర్తెలుసుకోవాలి. అధిక రక్తపోటు, గుండెదడ వంటి సమస్యలు మీకుటుంబంలో అంతకు ముందు ఎవరినైనా వేధించాయా అనేది ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం. ఈ సమాచారానికి అనుగుణంగా మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్న తరువాతే వైద్యుని సలహామేరసు వ్యాయామానికి సిద్దంకండి.
  • వ్యాయామంలో ఎప్పుడూ వేగంగా ఫలితాన్ని ఆశించకండి. ఆ ఉద్దేశ్యంతో మీశక్తికి మించి కూడా చెయ్యకూడదు. క్రమంగా చేసుకుంటూ పోతే కాస్త సమయం పట్టినా వచ్చే ఫలితాలు మీకు జీవితాంతం మంచి ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని ప్రసాదిస్తాయి.
  • హాయిగా నవ్వడం, నచ్చిన మ్యూజిక్ వింటూ వచ్చిన డ్యాన్స్ చేయడం ఇవి కూడా వ్యాయామంలో భాగమే. ఇవి ఒత్తిడిని ఇట్టే తరిమి కొడతాయని మరచిపోకండి.
  • వాకింగ్, రన్నింగ్ చేసేటప్పుడు మెత్తగా ఉండే కాటన్ సాక్సులు వేసుకొని, సాధారణంగా వాడే బూట్లకంటే కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్నవి వేసుకుంటే వ్యాయామానికి ఉపకరించడమే కాక ఎలాంటి కీళ్ళ నొప్పులు రాకుండా ఉపకరిస్తుంది.
  • వదులుగా చక్కగా శరీరానికి గాలి తగిలేలా, వ్యాయామ భంగిమలకు ఇబ్బంది లేకుండా ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి వస్త్రధారణ వ్యాయామం మరింతగా చేయాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది.
  • ఒక రకమైన వ్యాయామం చేసిన వెంటనే ఇంకొకటి మొదలు పెట్టకుండా కాస్త రిలాక్స్ అవ్వాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. వ్యాయామాన్ని నెమ్మదిగా మొదలు పెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అంతే కాని అప్పటి వరకు విశ్రాంతిగా ఉన్న శరీరాన్ని ఒక్కసారిగా ఒత్తిడికి గురి చేయకూడదు.