Wednesday, March 25, 2015

నీ ధర్మం

నీ ధర్మం

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు

జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు


సత్యంకోసం సతినే అమ్మినదెవరు-హరిశ్చంద్రుడు

తండ్రిమాటకై కానలకేగినదెవరు-శ్రీరామచంద్రుడు

అన్న సేవకై అంకితమైనదెవరన్నా-లక్ష్మన్నా

పతియె దైవమని తరించిపోయినదెవరమ్మ-సీతమ్మా

ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం అనుసరించుటే ధర్మం

అనుసరించుటే నీ ధర్మం ||నీ సంఘం, జాతి||


చావకూడుతో సమతను నేర్చెను నాటి పలనాటి బ్రహ్మన్న

మేడిపండులా మెరిసే సంఘం గుట్టువిప్పెను వేమన్న

వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి

తెలుగుభారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ

ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం ||నీ సంఘం, జాతి||


స్వతంత్రభారత రధసారధియై సమరాన దూకే నేతాజీ

సత్యగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ

గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి

తెలుగువారి కొక రాష్ట్రం కోరి ఆహుతి అయెను అమరజీవి

ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం

నీవు పుట్టిన ఈ దేశం ||నీ సంఘం, జాతి||

No comments:

Post a Comment