Saturday, April 25, 2015

పచ్చళ్లు

పచ్చళ్లు


అల్లం నిల్వ పచ్చడి


Ginger Pickle
కావలసిన పదార్ధాలు:
అల్లం ముక్కలు: 100 grm
బెల్లం తురుము: 100 grm
చింతపండు: 100 grm
ఎండుమిర్చి: 10
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: తగినంత
మెంతులు: 1tsp
ధనియాలు: 2tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
కరివేపాకు: 2 రెమ్మలు
వెల్లుల్లి: 10 రెబ్బలు

తయారు చేయు విధానము:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం ముక్కలను 5 నిమిషాలు వేయించాలి. తర్వాత చల్లారనివ్వాలి.
2. వేడినీళ్లలో చింతపండు నానబెట్టి చల్లారాక గుజ్జు తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో రెండు టీసూన్ల ఆయిల్ వేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మరో మూడు నిమిషాలు వేగనివ్వాలి. చల్లారాక వీటిని పొడి చేసి పెట్టుకోవాలి.
4. చల్లారిన అల్లం ముక్కలను గ్రైండ్ చేసుకుని, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పౌడర్ ను కలపాలి.
5. పాన్ లో కొద్ది ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపును పేస్ట్ చేసిన అల్లం పచ్చడిలో కలపాలి. అంతే అల్లం పచ్చడి రెడీ.
దీనిని గాలి చొరబడని బాటిల్ లో పెట్టి నిల్వచేసుకోవచ్చు. ఈ పచ్చడి దోసె, ఇడ్లీ, అన్నంలోకి మంచి కాంబినేషన్ అవుతుంది.

క్యాప్సికం చట్నీ


కావలసిన పదార్థాలు : క్యాప్సికం- అర కిలో, ఎండుమిరపకాయలు- 8, సెనగపప్పు- 8 చెంచాలు, మినపపప్పు- 6 చెంచాలు, ఆవాలు-4 చెంచాలు, మెంతులు- ఒకటిన్నర చెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, నూనె- 8 చెంచాలు, పసుపు- అర చెంచా, చింతపండు- కుంకుడుకాయంత, ఉప్పు- తగినంత, ఇంగువ- అర చెంచా. పోపుని రెండు భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకో భాగాన్ని అలంకరణకి ఉపయోగించాలి.

తయారీ విధానం : ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు, 3 చెంచాల మినపపప్పు, 2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చల్లారిన తర్వాత పొడి చేస ఉంచుకోవాలి. బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేయించి చల్లార్చాలి. తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. దీనికి మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ. చివరిలో తగిన ంత ఉప్పు కలుపుకోవాలి.


క్యాబేజీ చట్నీ


కావలసిన పదార్థాలు : క్యాబేజీ- సగభాగం, వేరుసెనగ పప్పు- పావు కప్పు, ఎండు మిరపకాయలు- 3, మినపపప్పు- 1 చెంచా, సెనగపప్పు- 1 చెంచా, ఇంగువ- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- కొంచెం, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- కొంచెం.

తయారీ విధానం : రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడిచేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి. తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి. వీటిని చల్లార్చి కొద్దగా నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. అది వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి. చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి. ఇది అన్నం, ఇడ్లీ,దోసెల్లోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ వాసన గిట్టని వారు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.


వంకాయ పెరుగుపచ్చడి


కావలసిన పదార్థాలు : పెద్దవంకాయలు-2, పచ్చి మిరపకాయలు-2, ఎండు మిరపకాయలు-2, కొబ్బరి తురుము-2 చెంచాలు, ఆవాలు- అర చెంచా, ఇంగువ- అర చెంచా, నూనె-2 చెంచాలు, పెరుగు- 2 కప్పులు, ఉప్పు తగినంత తయారీ విధానం : వంకాయలకు నూనెరాసి సన్నని మంటపై కాల్చుకోవాలి. చల్లారాక తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి రుబబుకోవాలి. దీన్ని వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి. ఆవాలు, ఇంగువ మిరప కాయలతో పోపు చేసి ఈ ముద్దకి చేర్చాలి. అంతే రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ.


పాలకూర చట్నీ


కావలసిన పదార్థాలు : పాలకూర- 2 కట్టలు, కొత్తిమీర- 1కట్ట, పచ్చి మిరపకాయలు- 8, జీలకర్ర- చెంచా, మెంతులు- ఒక చెంచా, పసుపు- చిటికెడు, నూనె- 6చెంచాలు, బెల్లం- 1చెంచా, నువ్వులు- 1 చెంచా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం : ముందుగా పాలకూర కొత్తిమీరను కడిగి సన్నగా తురుముకోవాలి. జీలకర్ర మెంతులను వేడిచేసి గ్రైండర్‌లో పొడి చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెపోసి మిరపకాయలను దోరగా వేయించుకోవాలి. తర్వాత పాలకూర కొత్తిమీరను వేసి వేయించాలి. అందులో పసుపు తగినంత ఉప్పు వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేయాలి. దాంతోపాటు జీలకర్ర మెంిపొడి, నువ్వులు, చింతపండు, బెల్లాన్ని కూడా గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంతో పాలకూర చట్నీ సిద్ధమైనట్లే. దీనిని అన్నం, చపాతీ, పూరీలతో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.


టమోటా ఆవకాయ


కావలసిన పదార్థాలు : టమోటాలు- 1 కిలో, నూనె- పావు కిలో, చింతపండు- 150 గ్రా, కారం- 125 గ్రా, ఉప్పు- పావు కిలో, అల్లంవెల్లుల్లి పేస్ట్- పావుకిలో, జీలకర్ర పొడి- 50 గ్రా, మెంతిపొడి-25 గ్రా, జీలకర్ర- 2 టీ చెంచాలు, ఆవాలు- 1 టీ చెంచా, ఇంగువ-చిటికెడు

తయారీ విధానం : చింపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి. గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇంగువ, జీలకర్ర, ఆవాలు నూనెలో వేయించి తీయాలి. చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. దీంతో టమోటా ఆవకాయ తయారయినట్లే. ఇది మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది

బీట్‌రూట్ చట్నీ


కావలసిన పదార్థాలు : బీట్‌రూట్- అర కిలో, చింతపండు- కొద్దిగా, పసుపు- చిటికెడు, ఎండు మిరపకాయలు- 10, ఆవాలు- చెంచా, మెంతులు - కొద్దిగా, ఇంగువ-కొద్దిగా, మినపపప్పు- చెంచా, ఉప్పు- తగినంత, కరివేపాకు- ఒక రెమ్మ, నూనె-50 గ్రాములు.

తయారీ విధానం : ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ని పచ్చివాసన పోయేదాక నూనెలో వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకుముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి. ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినపపప్పు, ఆవాలు, కరివేపాకు, తాలింపువేసి కలుపుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.


పైనాపిల్ పచ్చడి


కావలసిన పదార్థాలు : పండిన పైనాపిల్-1, బెల్లం- అరకిలో, కరివేపాకు-ఒక రెబ్బ, ఎండు మిరపకాయలు-5, కొబ్బరికాయ-1, ఆవాలు- అర చెంచా, పసుపు- అర చెంచా, జీలకర్ర-1 చెంచా, ఉప్పు- తగినంత

తయారీ విధానం : పైనాపిల్ చెక్కుతీసి చక్రాలుగా తురుముకోవాలి. ఓ పాత్రలో కొంచెం నీరుపోసి అందులో ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించండి. అందులో పసుపు, కారం ఉప్పు వేయండి. బెల్లం సన్నగా తురమండి. కొబ్బరి కోరులో జీలకర్ర, ఆవాలు కలిపి మెత్తని ముద్దగా నూరండి. ఎండు మిరపకాయలను విడిగా నూరి ముద్ద చేసుకోండి. ఉడుకుతున్న పైనాపిల్ ముక్కలు మొత్తబడగానే బెల్లం వే సి గంటెతో కలుపుతూ ఉండండి. ద్రావణం చిక్కబడుతుండగా కొబ్బరి ముక్క ఎండు మిర్చి ముద్ద, కరివేపాకు వేసి బాగా కలిపి దించండి. సిద్ధమైన పైనాపిల్ పచ్చడిని బ్రెడ్‌టోస్టుతో కలిపి వడ్డించండి.


చింతపండు చట్నీ


కావలసిన పదార్థాలు : చింతపండు- నాలుగు రెబ్బలు, ఎండుమిరప కాయలు- మూడు, మినపపప్పు- మూడు చెంచాలు, నువ్వులు- మూడు చెంచాలు, ధనియాలు-2 చెంచాలు, ఎండు కొబ్బరి పొడి- 2 చెంచాలు, నూనె- చెంచా, బెల్లం లేదా పంచదార- 2 చెంచాలు, ఉప్పు తగినంత.

తయారీ విధానం : ముందుగా చింతపండును నానబెట్టాలి. తర్వాత మినపపప్పు, నువ్వులు, ధనియాలు విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక బాణలిలో నూనెపోసి ఎండు మిర పకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో చింతపండు రసం, చింతపండు రెబ్బలు, మినపపొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టమున్నవాళ్లు తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలో లేదా పూరీ, చపాతీల మీదగాని వేసుకుని తినవచ్చు.


మునగాకు చట్నీ


కావలసిన పదార్థాలు : మునగాకు- 2కప్పులు, ఎండు మిరపకాయలు - 10, సెనగపప్పు- 2 చెంచాలు, మినపపప్పు- 2 చెంచాలు. కొబ్బరి తురుము- 1 కప్పు, చింతపండు- కాస్తంత, వేయించడానికి సరిపడినంత నూనె, ఉప్పు- తగినంత, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- 2 రెబ్బలు.

తయారీ విధానం : ముందుగా బాణలిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన వెంటనే ఎండు మిరపకాయలు, సెనగపప్పు, మినప పప్పు వేసి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరి కొంత నూనెపోసి మునగాకు వేయించాలి. తర్వాత వేయించిన మునగాకు ఎండుమిర్చి, సెనగపప్పు, మినపపప్పు, కొంచెం చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము వేసి అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. చివరిగా బాణలిలో మరో చెంచా నూనెవేసి ఆవాలు కొద్దిగా, మినపపప్పు, కరివేపాకు వేసి పోపు పెడితే సరిపోతుంది. దీంతో రుచికరమైన మునగాకు చట్నీ సిద్ధమైనట్లే.

- పి.రమాదేవి, సిర్సపల్లి, కరీంనగర్ 

మెంతి చట్నీ


కావలసిన పదార్థాలు : మెంతికూర కట్టలు-3, నూనె- 3 చెంచాలు, ఎండు మిరపకాయలు- 5, ఇంగువ- కొద్దిగా, బెల్లం- నిమ్మకాయంత, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, పసుపు-కొద్దిగా.

తయారీ విధానం : మెంతి ఆకుని గిల్లుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. బాణలిలో మూడు చెంచాల నూనె పోసి అందులో మెంతి ఆకుని వేసి కొంచెం నల్లరంగులోకి వచ్చేదాకా వేయించాలి. తర్వాత చింతపండుని వేడినీటిలో వేసినట్లయితే వెంటనే మెత్తపడుతుంది. ఈ లోపు రెండు చెంచాల నూనెని బాణలిలో వేసి అందులో 5 ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి దింపేయాలి. ముందుగా వేయించిన మెంతి ఆకుని గ్రైండర్‌లో వేసి రెండు మూడుసార్లు తిప్పాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం తిప్పాలి. అది మెత్తపడ్డాక మెత్తగా చేసుకున్న బెల్లం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మరలా తిప్పాలి. దీంతో ఘమఘుమలాడే మెంతి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశె, చ పాతీల్లోకీ బాగుంటుంది.

- మద్దాలి అచ్యుత లక్ష్మీకుమారి, సరూర్‌నగర్, రంగారెడ్డి జిల్లా 

* కాస్త ఉప్పు కలిపిన నిమ్మరసంతో తోమితే రాగిపాత్రలకు మెరుపు వస్తుంది. పాత్రలకంటిన నూనె జిడ్డు వదిలించాలన్నా ఇదే మార్గం.
* మైక్రోవేవ్‌లో వండినప్పుడు ఒలికిన పదార్థాలను తొలగించాక కాస్త ఉప్పు జల్లి తడి బట్టతో శుభ్రం చేస్తే మాడువాసన లేకుండా ఒవెన్ శుభ్రపడుతుంది.
* కొంచెం వెనిగర్, ఉప్పు కలిపి జల్లి మెత్తటి పీచుతో తోమితే స్టీలుపాత్రలు మెరుపు సంతరించుకుంటాయి.
* ఎప్పుడూ కాఫీ పెట్టే గిన్నె/పాట్‌కు గోధుమ రంగు మరకలవడం సహజం. అవి పోవాలంటే దానిలో ఒకసారి టీ పొడిని మరిగించి తర్వాత శుభ్రం చెయ్యాలి. తేయాకులో ఉండే టానిక్ యాసిడ్ కాఫీ మరకలను తీసేస్తుంది.
* సబ్బు నీటిలో చిటికెడు అమ్మోనియా పొడి కలిపి తోమితే పాత్రల దుర్వాసన పోతుంది.

No comments:

Post a Comment